● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
గార్లదిన్నె: రైతుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గార్లదిన్నె మండలం పాపినేపాళ్యంలో నీరు లేక ఎండిపోయిన చీనీ చెట్లను జిల్లా సీపీఐ నాయకులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పండ్ల తోటల అబివృద్ధికి నిధులు అందిస్తామని, చీనీ, టమాట పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామంటూ గొప్పలకు పోయిన ప్రభుత్వం.. ఆచరణలో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసర్థత కారణంగా నేడు పాపినేపాళ్యంలో చీనీ రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. గ్రామంలో తాగడానికి చుక్కనీరు కూడా లభ్యం కావడం లేదన్నారు. బోర్లలో నీరు అడుగంటి పోవడంతో రైతులు అప్పులు చేసి ఒక్కొక్క ట్యాంకర్‌కు రూ.1,500 చెల్లిస్తూ నీటి తడులు అందివ్వడం ద్వారా చీనీ చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం ట్యాంకర్లను ఏర్పాటు చేసి చీనీ చెట్లకు రక్షణ తడులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధి, కలెక్టర్ పర్యటించి కరువు అంచనా నివేదికలు తయారు చేసి తక్షణమే నష్ట పరిహారం చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, శింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రామకృష్ణ, చిన్నప్పయాదవ్, కుళ్లాయిస్వామి రాముడు, మధు, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.


