అనంతపురం అగ్రికల్చర్: విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం విత్తన వేరుశనగ ధరలు, రాయితీలు గురువారం ప్రకటించింది. సీజన్ సమీపిస్తున్నా ‘రైతుకు విత్తన విపత్తు’, ‘కానరాని ఖరీఫ్’ సన్నాహకం శీర్షికతో ఇటీవల సాక్షి వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధరలు, రాయితీ ప్రకటించారు. జిల్లాకు 56,423 క్వింటాళ్లు విత్తన వేరుశనగ కేటాయించగా, 40 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కే–6, టీసీజీఎస్–1694 రకాల వేరుశనగ క్వింటా పూర్తి ధర రూ.10,200 గా ఖరారు చేశారు. 40 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.6,120 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కదిరి–లేపాక్షి (కే–1812) రకం వేరుశనగ క్వింటా పూర్తి ధర రూ.9,500 కాగా 40 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,700 ప్రకారం చెల్లించాలి. ఒక్కో రైతుకు భూ విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా 90 కిలోలు (30 కిలోల బస్తాలు మూడు) పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆర్‌ఎస్‌కేల ద్వారా పంపిణీ
విత్తన పంపిణీని ఆర్‌ఎస్‌కేల ద్వారా చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో కొన్ని నిబంధనలు విధించారు. విత్తన నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే... 9 శాతం లోపు తేమ ఉండాలని, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు (ఇనర్ట్‌మ్యాటర్) 4 శాతం లోపు, మొలకశాతం 70 శాతం పైన, ఇతరత్రా విత్తనాలు ఉండకూడదని నిబంధనలు పెట్టారు. ప్రధానంగా అవుటన్ (షెల్లింగ్) 74 శాతం అంతకన్నా అధికంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా సేకరించడానికి వీలుగా 22 ప్రాసెసింగ్ ప్లాంట్లకు అనుమతులు జారీ చేశారు.
ధర పెంచి... రాయితీ ప్రకటించి!
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా విత్తన వేరుశనగ రూ.7,500 ధర పలుకుతోంది. ఇదే విషయాన్ని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అటు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, ఇటు బళ్లారి ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే ధర పలుకుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్వింటా రూ.10,200 ఖరారు చేస్తూ 40 శాతం రాయితీ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. మూడు బస్తాల కోసం రిజిష్ట్రేషన్లు, పంపిణీ సమయంలో వృథా ప్రయాస తప్పదంటున్నారు. నాణ్యతా ప్రమాణాలు మాటున నాసిరకం, కల్తీ విత్తనాలు అంటగట్టే అవకాశం ఉందనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోకుండా సొంతంగా కాస్త అటుఇటుగా రూ.7,500తో కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. క్వింటాపై 40 శాతం సబ్సిడీ రూ.4,080 పోతుందని చెబుతున్నా... మార్కెట్ రేటు బట్టి చూస్తే రైతుకు రూ.1,500కు మించి లభించే పరిస్థితి లేదని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితి బట్టి అమ్మకం ధర అయినా తగ్గించాలని, లేదంటే రాయితీ అయినా పెంచాలని రైతులు కోరుతున్నారు.
విత్తన వేరుశనగ
విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ
కే–6 క్వింటా పూర్తి ధర రూ.10,200 ఖరారు
రాయితీ పోనూ రైతుల వాటాగా రూ.6,120
బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.7,500


