అనంతపురం అర్బన్: విమర్శలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని జిల్లా పరిషత్ నూతన సీఈఓ విజయలక్ష్మికి కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. కలెక్టర్‌ను కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సీఈఓ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
రైలు నుంచి జారి పడి
వ్యక్తి మృతి
యాడికి: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. యాడికి మండలం వేములపాడు – రాయలచెరువు గ్రామాల మధ్యలో పట్టాల పక్కన మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గుత్తి రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని మహారాష్ట్రలోని షోలాపూర్ నగరానికి చెందిన సునీల్ (39)గా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సునీల్... అక్కడి నుంచి బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమై షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. గురువారం వేకువజామున యాడికి మండలం వేములపాడు దాటిన తర్వాత డోర్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో గాలి వేగానికి డోర్ బలంగా తాకడంతో ఒక్కసారిగా ఎగిరి పట్టాల పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి రైల్వే పోలీసులు తరలించి, దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్
పోటీలకు ఎంపిక
అనంతపురం టౌన్: జిల్లాలోని పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పుష్పావతి, మురళీకృష్ణ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంపికై న వారిలో ఎం.వందన, ఆర్.శమిత, ఎస్.పి.అహిల్, ప్రణీత్ కుమార్, అమన్, డి.నిఖిల్, హిమవంత్‌రెడ్డి ఉన్నారు. వీరు ఈ నెల 16 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు.
నాణ్యమైన వైద్య సేవలు
అందించాలి
బ్రహ్మసముద్రం: చికిత్స కోసం వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పీహెచ్‌సీ సిబ్బందిని అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం బ్రహ్మసముద్రంలోని పీహెచ్‌సీని ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. గత ఏడాది నుంచి నమోదవుతున్న కుష్టు వ్యాధి, క్షయ, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన కేసుల వివరాలపై ఆరా తీశారు. హైరిస్క్ గర్బిణుల వివరాలను మండల వైధ్యాధికారి రాజేష్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ అంశంలో ఎఎన్‌ఎంలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులోనే సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఫారా మెడికల్ ఆఫీసర్ నాగన్న, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాణి ఎస్తేర్, పీహెచ్‌ఎన్ ఆదిబయమ్మ, ఫార్మసిస్ట్ మహేష్, హెల్త్ అసిస్టెంట్ జాన్సన్ పాల్గొన్నారు.
ఎలుగుబంటి మృతి
కుందుర్పి: మండలంలోని కరిగానిపల్లి గ్రామ సమీపంలో గురవారం సాయంత్రం ఓ ఎలుగుబంటి మృతి చెందింది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం అటవీ రేంజ్ అధికారి రామచంద్రుడు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వన్యప్రాణుల బారి నుంచి పంటకు రక్షణగా రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెను తాకడం వల్లనే ఎలుగుబంటి మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణ చేపట్టి పొలాల్లో విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన రైతులపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.


