ధర్మవరం రూరల్: పాము కాటుతో ఓ పాడి రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. ధర్మవరం మండలం తుంపర్తి కాలనీకి చెందిన దేవరకొండ వెంకటరమణ(46)కు భార్య వెంకరమణమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాడి పోషణతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం షెడ్డులో ఉన్న పాడి ఆవులకు మేత వేసే క్రమంలో వామి వద్ద గడ్డిలో దాగి ఉన్న నాగుపాముపై కాలు వేశాడు. దీంతో పాము కాలి బొటనవేలును గట్టిగా కరిచి పట్టుకుంది. గమనించిన వెంకటరమణ కాలిని విదిలించినా పాము విడవలేదు. దీంతో చేతితో పామును పట్టుకుని పక్కకు లాగి దూరంగా విసిరేశాడు. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడకు చేరుకుని చికిత్స నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్తు తీగల చోరీ
గాండ్లపెంట: మండలంలోని గాజులవారిపల్లి పెద్ద తండాలో బుధవారం రాత్రి వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్తు తీగలు(కేబుల్) చోరీకి గురైనట్లు రైతులు క్రిష్ణా నాయక్, చంద్రానాయక్, శంకర్‌నాయక్, వెంకటరమణనాయక్, దీప్లా నాయక్, తిరుపాల్‌నాయక్, గంగరాజు తెలిపారు. బోర్లకు ఉన్న కేబుల్ ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించుకుని వెళ్లారని వాపోయారు. ఈ విషయంపై స్దానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి
చిలమత్తూరు: చేపల వలలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన మేరకు.. చిలమత్తూరు మండలం కోడూరుకు చెందిన పెద్ద రెడ్డప్ప (40) మూడు రోజుల క్రితం దిగువ తుమ్మలకుంట సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో వలలో చిక్కుకుని నీట మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఈ అంశం వెలుగు చూడలేదు. గురువారం ఉదయం చెరువు వైపుగా వెళ్లిన స్థానికులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా, మృతుడికి ఓ సోదరుడు ఉన్నాడు. కూలి పనులతో జీవనం సాగించేవాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పట్టపగలే చోరీ
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం పాముదుర్తిలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలో నివాసముంటున్న ఒంటరి మహిళ కాళసముద్రం రామక్క గురువారం ఉదయం 10.30 గంటలకు చికిత్స చేయించుకునేందుకు ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకున్న ఆమె ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఆందోళనకు లోనవుతూ లోపలికి వెళ్లి పరిశీలించింది. బీరువాలోని సామగ్రిని చిందరవందరగా పడేసి ఉండడంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీరువాలో దాచిన 4 తులాలు బంగారు గొలుసు, 6 గ్రాముల తాళిబొట్టు గిన్నెలు రెండు, రూ.1.20 లక్షల నగదు అపహరించుకెళ్లినట్లు బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


