● లోకేష్ సమావేశంలో భజనపరులకు పెద్దపీట
అనంతపురం క్రైం: మంతి నారా లోకేష్ గురువారం అనంతపురంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశంపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యులను కాదని భజన పరులకు పెద్ద పీట వేశారంటూ మండిపడుతున్నారు. సమావేశానికి ముందు జెడ్పీ ఎదుట ఉన్న రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై ఎవరిని లోపలికి అనుమతించాలి, ఎవరిని రానివ్వకూడదు అనే దానిపై జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటాలు చేసిన పలువురు సీనియర్ కార్యకర్తలు సమావేశం వద్దకు వెళ్లినా ‘జాబితాలో మీ పేరు లేదు’ అంటూ వెనక్కి పంపించేశారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులను సమావేశానికి పూర్తిగా దూరం పెట్టేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రమేయమే ఇందుకు కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. అంతర్గత విభేదాలు బయట పడకుండా ఉండేందుకే మీడియాను దూరంగా ఉంచినట్లు సమాచారం.
లోకేష్ పర్యటనలో అపశ్రుతి
మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోకి కాన్వాయ్ ప్రవేశిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుని కింద పడిన మహిళా కార్యకర్త మీదుగా మంత్రి కారు దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు పక్కకు లాగేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా కష్ట పడ్డాం. చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో మూడు నెలల పాటు నిరజన సభలు నిర్వహించాం. ఈ రోజు లోకేష్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు వెళితే గేటు బయటే మమ్మల్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటకు పంపించేశారు. పార్టీలో ముఖ్యులైన చాలా మంది ఇలాగే భంగపడ్డారు.
– జేఎం బాషా, టీడీపీ మైనారిటీ నాయకుడు


