తెలుగులో తేలిపోయారు! | - | Sakshi
Sakshi News home page

తెలుగులో తేలిపోయారు!

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈసారి విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. సాధారణంగా గణితం, సైన్స్‌ వంటి సబ్జెక్టులనే విద్యార్థులు కఠినంగా భావిస్తుంటారు. కానీ ఈసారి వెలువడిన ఫలితాలు చూస్తే మాతృభాష తెలుగు కూడా విద్యార్థులకు భారంగా మారిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు సబ్జెక్టులో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిలవడం కలవరపెడుతోంది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల (ప్రభుత్వ, మునిసిపాలిటీ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, బీసీ వెల్ఫేర్‌, కేజీబీవీ, ఏపీఎంఎస్‌, మైనార్టీ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌) నుంచి మొత్తం 19,004 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 12,338 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే...తెలుగు 3,358 మంది, గణితం 3,960 మంది, సైన్స్‌ 3,792 మంది, సోషల్‌ 3,800 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. ఈ గణాంకాల్లో అత్యంత ఆశ్చర్యకర అంశం ఏమిటంటేం గణితం, సైన్స్‌లాంటి కఠిన సబ్జెక్టులకు దగ్గరగానే తెలుగులో కూడా ఫెయిలైన వారి సంఖ్య ఉండటం. ఇది సాధారణ విషయం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు చదవడం తగ్గిందా..?

ఒకప్పుడు తెలుగు పాఠ్యాంశం విద్యార్థులకు ‘సులభమైన సబ్జెక్ట్‌’గా ఉండేది. కథలు, పద్యాలు, వ్యాకరణం సులువుగా అర్థమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా, ఇంగ్లిష్‌ ప్రభావం పెరగడంతో పిల్లల్లో తెలుగు చదివే అలవాటు తగ్గిపోయిందని అంటున్నారు. చాలామంది విద్యార్థులు తెలుగు పాఠాన్ని అర్థం చేసుకుని రాయలేకపోతున్నారని, ముఖ్యంగా వ్యాకరణం, భావవ్యక్తీకరణలో బలహీనత ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.

భాషపై పట్టు తగ్గుముఖం

ప్రస్తుత విద్యా వ్యవస్థ మొత్తం ‘మార్కుల కేంద్రితం’ అయిపోయిందని నిపుణులు చెబుతున్నారు. గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులకు ప్రత్యేక శిక్షణలు, ట్యూషన్లు ఉండగా తెలుగు పట్ల మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ‘తెలుగు వచ్చేదే’ అన్న భావనతో చాలామంది దానిపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని, చివరికి అదే ఫలితాల్లో ప్రతిబింబించిందని ఉపాధ్యాయులు అంటున్నారు. తెలుగు సబ్జెక్టులో భారీగా ఫెయిల్యూర్లు రావడం ఉపాధ్యాయులను కూడా కలవరపెడుతోంది. మాతృభాషలో విద్యార్థులు కనీస ప్రమాణాలు కూడా అందుకోలేకపోవడం భవిష్యత్తులో భాషా నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. చదవడం, రాయడం, భావాన్ని వ్యక్తపరచడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు బలహీన పడితే ఉన్నతవిద్యలోనూ సమస్యలు తలెత్తే అవకాశముందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. తెలుగు కేవలం సబ్జెక్ట్‌ కాదు.. అది భావవ్యక్తీకరణ, సంస్కృతి, వ్యక్తిత్వానికి మూలం. అలాంటి భాషలోనే విద్యార్థులు వెనుకబడటం నిజంగానే ‘మాతృభాష ఘోషిస్తోంది’ అని పలువురు పేర్కొంటున్నారు.

తాడిపత్రి మండలంలో 885మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. వారిలో 199 మంది ఫెయిల్‌ అయ్యారు. అందులో వందమంది విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఫెయిల్‌ కావడం గమనార్హం. తాడిపత్రి ఏపీ మోడల్‌ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులు ఫెయిల్‌ కాగా, అందరూ తెలుగులోనే ఫెయిల్‌ కావడం విశేషం.

తెలుగు చదవడం, రాయడం కూడా కష్టమేనా..?

పదో తరగతి ఫలితాల్లో వెలుగుచూసిన ఆందోళనకర నిజాలు

గణతం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులతో సమానంగా తెలుగులోనూ ఫెయిల్‌

Advertisement
 
Advertisement
Advertisement