● రహస్య విచారణలో బట్టబయలు
● 9 మండలాల ఎంఈఓ–2లపై చర్యలకు రంగం సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. అనేక స్కూళ్లలో భోజనం అధ్వానంగా ఉందని కలెక్టర్ ఆనంద్ నిర్వహించిన రహస్య విచారణలో బయట పడింది. పథకం అమలుపై వస్తున్న ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్.. అధికారికంగా ప్రకటించకుండా ప్రత్యేక త్రీమెన్ కమిటీని నియమించి వివిధ మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేయించారు. ఈ కమిటీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి, జిల్లా చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్‌మెంట్ అధికారి సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇటీవల పలు పాఠశాలల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించింది. కమిటీ నివేదికలో అనేక పాఠశాలల్లో నాణ్యత లేని ఆహారం, మెనూ పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి తీవ్ర లోపాలు బయటపడినట్లు సమాచారం. విద్యార్థులకు సరిపడా ఆహారం అందకపోవడం, కొన్ని చోట్ల రికార్డులు ఒకలా – వాస్తవ పరిస్థితులు మరోలా ఉండటం అధికారులను షాక్‌కు గురి చేసింది. ఈ నివేదిక ఆధారంగా అనంతపురం రూరల్, రాప్తాడు, గార్లదిన్నె, పెద్దపప్పూరు, కూడేరు, పుట్లూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బెళుగుప్ప మండలాల ఎంఈఓ–2లకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్‌తో ప్రేమ్ నోటీసులు జారీ చేయాలని గురువారం రాత్రి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


