అనంతపురం: నైతిక విలువలకు తిలోదకాలిచ్చి.. బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ శీర్షిక కింద సాగిస్తున్న చెత్త పలుకులపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనాగ్రహం మిన్నంటింది. ఆలికి, చెల్లికి తేడా తెలియని మూర్ఖుడంటూ విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురంలోని ఆంధ్రజ్యోతి ప్రాంతీయ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోతరాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అత్యుత్సాహం
రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ పేరుతో మహిళలను నీచమైన భాషతో దూషించిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఆంక్షలు విధించారు. మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి.. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. శాంతియుతంగా నిరసన చేస్తామంటూ కొంగు చాచి, నమస్కరిస్తూ వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. ఆడబిడ్డలను అవమానకరంగా దూషించిన రాధాకృష్ణకు అండగా ఉంటారా? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు మూడంచెల భద్రత ఇవ్వని పోలీసులు.. బ్రోకర్ రాధాకృష్ణ కార్యాలయానికి భద్రత కల్పించడం నీచమైన చర్య అంటూ అభివర్ణించారు.
దిగజారుడు వ్యాఖ్యలు
జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన రోత రాతలు దిగజారుడుగా ఉన్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ధ్వజమెత్తారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ నీచపు రాతలు రాస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలికి, చెల్లికి తేడా తెలియని మూర్ఖుడు ఏబీఎన్ రాధాకృష్ణ అని, జర్నలిజం ముసుగులో దిగజారి ప్రవర్తిస్తూ.. రాక్షసానందం పొందుతున్నాడని మండిపడ్డారు. బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో మహిళా లోకాన్ని కించపరిచే విధంగా రోత రాతలు రాయడం దుర్మార్గమన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి అని, ఆయన పాపాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. మాజీ మేయర్ వసీం మాట్లాడుతూ మూడు ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’కు జనం జేజేలు పలుకుతుంటే ఏబీఎన్ రాధాకృష్ణ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, మహిళా నేతలు శోభారాణి, భారతి, సాకే చంద్రలేఖ, ఉష, చంద్రకళ, కమర్తాజ్, రాధా యాదవ్, శోభాబాయి, లక్ష్మీ నరసమ్మ, అంజలి, జయమ్మ, నీలమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్, చింతకుంట మధు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, ఓబిరెడ్డి, శ్రీనివాస్ నాయక్, చంద్రశేఖర్ యాదవ్, నాయకులు గోగుల రాధాకృష్ణ, ఇలియాజ్, దేవి, జాన్ విజయ్‌కుమార్ (జానీ), బాబా సలాం, నితిన్‌రెడ్డి, గువ్వల రాజేశ్‌రెడ్డి, కొర్రపాడు హుస్సేన్ పీరా, వేముల నదీం, సాదిక్, శేఖర్ బాబు, దాదా ఖలందర్, మాలపాటి శ్రీనివాసులు, సంపంగి రామాంజినేయులు, రామకృష్ణ, అబ్బాస్, వినీత్, బీసీ శేఖర్, ఖాజా, ఈడిగ చంద్ర, రామ్మోహన్‌రెడ్డి, కై లాష్, అంజి, సురేంద్ర, నరసింహారెడ్డి శోభన్, రమేష్, సుబ్బయ్య, షంషుద్దీన్, బాషా, కేశవరెడ్డి, ముక్తియార్, కాకర్ల శ్రీనివాస్‌రెడ్డి, కుళ్లాయిస్వామి, రాజారత్నం, మైనుద్దీన్, చండ్రాయుడు, పసులూరి ఓబులేసు, సాకే అశోక్, హరికృష్ణ, నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్, సురేష్, మధు, నాగార్జున, రామకృష్ణ, బోయ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు చేతపట్టుకుని బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నేతలు
శాంతియుత ఆందోళనకు అడ్డుపడవద్దని చేతులు జోడించి వేడుకుంటున్న మహిళా నేతలు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రోత రాతలపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల కన్నెర్ర
ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్
ఏబీఎన్ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆందోళన
మూడంచెల భద్రతతో అడ్డుకున్న పోలీసులు


