● నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్న జేడీఏ రవి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2026కు సంబంధించి కమిషనరేట్ నుంచి 56,423 క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీకి ప్రాథమికంగా అనుమతులు వచ్చాయి. ఖరీఫ్ విత్తన పంపిణీ సన్నాహక చర్యల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విత్తన సరఫరా ఏజెన్సీలతో జేడీఏ ముదిగల్లు రవి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాసులు, టెక్నికల్ ఏవో రాకేష్‌నాయక్ తదితరులు సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్–2026కు సంబంధించి వేరుశనగతో పాటు 759 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్ సీడ్), 60 క్వింటాళ్ల చొప్పున పెసలు, రాగులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే సేకరణ ధరలు ఖరారయ్యే అవకాశం ఉన్నందున.. జిల్లాలో నాణ్యమైన విత్తనాలు సేకరించి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా వేరుశనగ అవుటన్ (షెల్లింగ్) 75 శాతం కన్నా అధికంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. 50,423 క్వింటాళ్లు కే–6 విత్తన వేరుశనగతో పాటు కదిరి–లేపాక్షి, టీసీజీఎస్ రకాలు కొంత వరకు పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బకాయిలు చెల్లించాలని డిమాండ్
గత ఖరీఫ్, రబీకి సంబంధించి తమకు రావాల్సిన సొమ్ము చెల్లించకుండా ఏపీ సీడ్స్ బకాయి పడిందని వేరుశనగ సరఫరా ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు కూడా విత్తనాన్ని సరఫరా చేశామన్నారు. జిల్లాకు సంబంధించి రూ.110 కోట్ల బకాయిలు ఉన్నందున తమ పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. బకాయిలు చెల్లిస్తే కానీ ఈసారి సరఫరా చేయడం తమకు కష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. గతేడాది వేరుశనగ ధరలు పెరిగినందున ఈసారి రైతులు పంట సాగుకు మక్కువ చూపుతున్నందున కేటాయించిన 56 వేల క్వింటాళ్లు సరిపోవన్నారు. బకాయిలు చెల్లించి.. జిల్లాకు కనీసం లక్ష క్వింటాళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


