అక్కడ పని చేయాలంటే హడల్‌ | - | Sakshi
Sakshi News home page

అక్కడ పని చేయాలంటే హడల్‌

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

అనంతపురం సెంట్రల్‌: నగరంలో నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కీలకమైనది. ప్రజలతో పాటు అత్యధిక మంది ప్రముఖులు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నివాసముంటున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ స్టేషన్‌ పరిధిలోని రుద్రంపేట సమీప కాలనీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఇక్కడ వంద మందికి పైగా రౌడీషీటర్లతో పాటు అసాంఘిక శక్తులు, ఇతర నేర చరిత ఉన్నవారు కలిసే ఉంటున్నారు. అలాంటి పరిస్థితులున్న ఈ స్టేషన్‌కు రెగ్యులర్‌ ఇన్‌స్పెక్టర్‌ లేరు. ఇన్‌చార్జ్‌ పాలనలోనే నడుస్తోంది. నెల క్రితం సీఐ జగదీష్‌ తనకు ఇక్కడ పోస్టు వద్దని తిరుపతి పీటీసీకి బదిలీ పెట్టుకొని మరీ వెళ్లిపోయారు. ఆ సమయంలో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరులు వరుసగా దాడులు, దందాలతో చెలరేగిపోయారు. ముఖ్యంగా నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టడం, ఎగ్జిబిషన్‌ నిర్వాహకునిపై దాడి, బెదిరింపులతో పాటు భూకబ్జాలు కూడా వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సదరు సీఐ తీవ్ర ఒత్తిడికి గురికావడంతో ఇక్కడ పనిచేయలేనంటూ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని నెలలపాటు అయిష్టంగానే పనిచేసిన ఆయన ఎట్టకేలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఎక్కువగా అధికార పార్టీ నాయకుల కేసులు డీల్‌ చేయాల్సి ఉండడంతో ఈ స్టేషన్‌కు రావడానికి చాలామంది సీఐలు అయిష్టత చూపుతుండడంతో తాత్కాలికంగా త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

సమర్థులైన సీఐలే లేరా?

ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు అధికారుల్లో దాదాపు అందరూ ఆయా ఎమ్మెల్యేల సిఫార్సుతో ఆయా స్థానాలకు వచ్చిన వారు కావడంతో శాంతిభద్రతలు అదుపు తప్పినప్పుడు చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కూడా ఇదే జరిగింది. దీంతో ఈసారి రాజకీయ సిఫార్సులు కాకుండా సీఐలను నియమించాలని పోలీసు బాస్‌లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసు బాస్‌లకు సమర్థవంతమైన సీఐలు కనపడలేదో ఏమో కానీ నియామకం మాత్రం జరగడం లేదు. అనంతపురం రూరల్‌ సీఐ శేఖర్‌, గతంలో ధర్మవరంలో పనిచేసిన కరుణాకర్‌, హరినాథ్‌ లాంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ అవి కేవలం పుకార్లకే పరిమితమవుతున్నాయి. ఇదిలా ఉంటే నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో పలు పంచాయతీలు, కార్పొరేషన్‌ డివిజన్‌లు ఉండడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సిఫార్సుకే పెద్దపీట వేస్తారా.. లేదా ఎవరైనా సమర్థవంతమైన అధికారిని సీఐగా నియమిస్తారా అన్నది వేచి చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు.

బాబోయ్‌.. ఫోర్త్‌ టౌన్‌కా..?

నెల రోజులుగా ఇన్‌చార్జ్‌ పాలన

కీలక పోలీసు స్టేషన్‌కు రావడానికి సీఐల అయిష్టత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement