మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించాలి

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో పదోతరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూల్యాంకనం నిర్వహణ విధానం, ఉపాధ్యాయులకు ఉన్న సౌకర్యాలు, రోజుకు ఎన్ని పేపర్లు మూల్యాంకనం చేస్తున్నారనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మూల్యాంకనం ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈఓ ప్రసాద్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

నేడు ఫ్యాప్టో నిరసన

అనంతపురం ఎడ్యుకేషన్‌: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మలిదశ పోరాటంలో భాగంగా గురువారం పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబును కలసి వినతి పత్రం అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద నిరసన తెలియజేయనున్నట్లు నాయకులు వెల్లడించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్ల దొంగకు మూడేళ్ల జైలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి వైర్లు దొంగతనం చేసిన ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి సి.సత్యవాణి బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం మేరకు.. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముగ్గురు రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల్లలో రాగి, అల్యూమినియం, కేబుల్‌ వైర్లు చోరీ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్లు 61/2024, 195/2024, 79/2024 కింద విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 136(1) ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు, రూరల్‌ ఎస్డీపీఓ వెంకటేష్‌ పర్యవేక్షణలో సీసీఎస్‌ సీఐలు ఇస్మాయిల్‌, జైపాల్‌రెడ్డి, రూరల్‌ సీఐ ఎన్‌.శేఖర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో 2024 డిసెంబర్‌ 19న కక్కలపల్లి టమాట మార్కెట్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జిల్లాలో నమోదైన 33 విద్యుత్‌ దొంగతనాల కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రధాన నిందితుడు చాకలి రాఘవేంద్ర అని తేల్చారు. వీరి నుంచి సుమారు 430 కిలోల రాగి వైర్లు, 160 కిలోల అల్యూమినియం వైర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును అప్పటి ఏఎస్‌ఐ జి.విజయ్‌కుమార్‌ నమోదు చేయగా, సీఐ ఎన్‌.శేఖర్‌ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేపాక్షి నాయుడు వాదనలు వినిపించారు. మొత్తం ఆరుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. చాకలి రాఘవేంద్రపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి సి.సత్యవాణి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ వై.మారెన్న (ఏఎస్‌ఐ), కోర్టు సిబ్బంది ఎన్‌.రజాక్‌, ప్రాసెస్‌ ఏఎస్‌ఐ ఎస్‌.సునీల్‌ కుమార్‌, కానిస్టేబుళ్లు బి.రామమోహన్‌, బి.రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సాక్షులను సకాలంలో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో కృషి చేసిన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, దర్యాప్తు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement