గుత్తి: అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హతమార్చిన భర్తను అరెస్ట్ చేసినట్లు గుత్తి పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ రామారావు, ఎసఐ సురేష్ వెల్లడించారు. గుంతకల్లు మండలం మైనాపురం గ్రామానికి చెందిన శివలింగయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై శివలింగయ్య అనుమానాలు పెంచుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు భార్యతో గొడవపడేవాడు. మంగళవారం లక్ష్మిని తన సోదరి ఊరైన కదిరిపల్లికి ద్విచక్ర వాహనంపై పిలుచుకెళ్లిన శివలింగయ్య... తిరుగు ప్రయాణంలో గుత్తి మండలం పూలకుంట సమీపంలో ఉన్న కంకర మిషన్ వద్ద బైక్‌ను ఆపి ఆమె కిందకు దిగగానే రాళ్లతో దాడి చేశాడు. బలమైన గాయం కావడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బుధవారం గుత్తి శివారులోని లచ్చానపల్లి రోడ్డులో తచ్చాడుతున్న శివలింగయ్యను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హతమార్చానంటూ నిందితుడు అంగీకరించాడు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


