అనంతపురం అగ్రికల్చర్: రైతులకు పెట్టుబడుల భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేడీఏ ముదిగల్లు రవి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అనంతపురంలోని ప్రకృతి వ్యవసాయ విభాగం కార్యాలయంలో నాచురల్ ఫార్మింగ్ చీఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఐఓ) లక్ష్మానాయక్ అధ్యక్షతన వ్యవసాయ, సెర్ఫ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం జేడీఏ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయ విధానాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుండటం అభినందనీయమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు పెట్టుబడుల భారం తగ్గించి దిగుబడులు పెంచే ఆలోచన చేయాలన్నారు. ఇందుకు గాను పూర్వపు వ్యవసాయ విధానాలకు కాస్త ఆధునికత జోడించి శాసీ్త్రయ పద్ధతుల్లో పంటల సాగుచేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి సాగు పద్ధతుల్లో భాగంగా పీఎండీఎస్, డాక్టర్ పీఎం, హెచ్‌ఎం మోడల్స్ కింద వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు చేయించాలన్నారు.


