అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. శిలాఫలకాలపై ఫొటో వేసుకునేందుకు గత ప్రభుత్వంలో చేసిన పనులను సైతం తన ఖాతాలోకి వేసుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎ.నారాయణపురం బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంత్రితో కలిసి మళ్లీ శంకుస్థాపన చేయించారు. తాజాగా అనంతపురం రూరల్ గ్రామపంచాయతీలో తాగునీటి పథకం సంప్‌లను మరోమారు ప్రారంభించి ‘క్రెడిట్ చోరీ’కి యత్నించారు. వాస్తవానికి 2024 మార్చి 15న అనంతపురం రూరల్ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి సర్పంచ్ ఉదయ్ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత తన ఫొటో వేసుకుని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. ఇవే కాదు.. రుద్రంపేట, రాజీవ్ కాలనీ పంచాయతీలు మొదలుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక పనులను క్రెడిట్ చోరీ చేస్తుండడంతో అధికార టీడీపీ నాయకులే బాహాటంగా నవ్వుకుంటున్నారు. వీలైతే నిధులు మంజూరు చేయించుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాలే కానీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను తన ఖాతాలో వేసుకోవడం ఏంటంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించిన ‘అనంత’
అనంతపురం రూరల్ పంచాయతీలో ఆరువేలకు పైగా జనాభా ఉంది. పంచాయతీ ఆవిర్భావం నుంచి ప్రజల అవసరాలకు బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గడప గడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన అప్పటి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి ప్రజలు తమ సమస్యను వివరించి.. ఫోరైడ్ నుంచి విముక్తి కల్పించాలని కోరారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అనంత హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సత్యసాయి తాగునీటి పథకం ద్వారా రూరల్ పంచాయతీకి 2.5 లక్షల లీటర్ల తాగునీటిని అందించే పథకాన్ని మంజూరు చేయించారు. ఇందుకు అవసరమైన నిధులను జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, అప్పటి ఎంపీ తలారి రంగయ్య సహకారంతో సమీకరించారు. వాటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వినియోగించారు. కోటి రూపాయల వ్యయంతో ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. ఇది వరకే సురక్షిత తాగునీరు సరఫరా చేశారు. అయితే ఈ పనులను తానే చేయించినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇప్పుడు హడావుడి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
క్రెడిట్ చోరీలో దగ్గుపాటి దూకుడు
శిలాఫలకాలపై ఫొటోలు వేసుకుని మురిసిపోతున్న ప్రజాప్రతినిధి
ఇదెక్కడి చోద్యమంటూ విస్తుపోతున్న నగర ప్రజలు


