అర ఎకరాకు ఆరుగురు కాపలా! | - | Sakshi
Sakshi News home page

అర ఎకరాకు ఆరుగురు కాపలా!

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

అనంతపురం అగ్రికల్చర్‌: పట్టుపరిశ్రమ శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి మల్బరీ విస్తీర్ణం పెంపునకు చర్యలు చేపట్టడం లేదు. అక్కడక్కడా పట్టుగూళ్లు పెంచుతున్న రైతులకు సూచనలు చేయడానికి కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేసవిలో పంట సరిగా చేతికిరాక రైతులు అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పట్టుపరిశ్రమ అధికారులు... అదే పట్టుశాఖ కార్యాలయ ఆవరణలో అర ఎకరా నర్సరీకి మాత్రం ఆరుగురిని కాపలా ఉంచటంపై సమాధానం చెప్పలేకపోతున్నారు. మల్బరీ నర్సరీ ఎవరూ తినేది కాదు. దొంగలు ఎత్తుకెళ్లేదీ కాదు. పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. దాని కోసం ఒకదిద్దరు టెక్నికల్‌ సిబ్బంది ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక సెరికల్చర్‌ ఆఫీసర్‌ (ఎస్‌వో) నేతృత్వంలో ఐదారుగురు పనిచేస్తుండటం గమనార్హం. ఏడాది పొడవునా నర్సరీ ద్వారా కనీసం ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి లేకున్నా... కాపలాదారులకు మాత్రం పదింతలు వరకు వేతనాల రూపంలో వెచ్చిస్తున్నారు. కార్యాలయాలకు, నర్సరీ పర్యవేక్షణకు ఎపుడు వస్తారో తెలియదంటున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ పట్టుశాఖ అధికారులు హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

69 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల తొలగింపు

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన షిఫ్ట్‌ ఆపరేటర్లుగా విధుల్లోకి చేరిన వారిలో 69 మంది నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. వారందరినీ తక్షణమే తొలగించడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని తిరుపతిలో ముగ్గురు, చిత్తూరులో నలుగురు, కడపలో 38 మంది, కర్నూలులో 16 మంది, అన్నమయ్యలో ఒకరు, అనంతపురంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో నలుగురు చొప్పున నకిలీ ఐటీఐ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి షిఫ్ట్‌ అపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వారందరిని తక్షణమే తొలగించడంతో పాటు ఏజెన్సీలకు నోటీసులను జారీ చేయాలని ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేశారు.

అక్కడక్కడా అకాల వర్షాలు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 3.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గుత్తి 31.2 మి.మీ, ఉరవకొండ 28.2, శెట్టూరు 14.6, కంబదూరు 14.6, వజ్రకరూరు 5.8, బ్రహ్మసముద్రం 5 మి.మీ, గుమ్మఘట్ట, పెద్దవడుగూరు, కూడేరు తదితర మండలాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల అరటి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నా... పంటలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి రిపోర్టులూ రాలేదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.

వార్డుల సంఖ్య పెంపు

తాడిపత్రి రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకుని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ అండ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 36 నుంచి 48, గుంతకల్లులో 37 నుంచి 48, రాయదుర్గంలో 32 నుంచి 40, గుత్తిలో 25 నుంచి 32, కళ్యాణదుర్గంలో 24 నుంచి 32, కదిరిలో 36 నుంచి 44, పుట్టపర్తిలో 27 నుంచి 28, మడకశిరలో 20 నుంచి 23, హిందూపురంలో 38 నుంచి 52, పెనుకొండ నగరపంచాయతీలో 20 నుంచి 23కు వార్డుల సంఖ్య పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement