విధుల్లో నిర్లక్ష్యం వీడండి | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వీడండి

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశం

బొమ్మనహాళ్‌: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వీడి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. బుధవారం ఆయన బొమ్మనహాళ్‌ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ సేవల అమలులో లోపాలు బట్టబయలయ్యాయి. బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత బొమ్మనహాళ్‌లో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసి.. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడుతూ ఏ పంటలు సాగు చేశారని ఆరా తీశారు. నేమకల్లుకు చెందిన ఓ రైతు తనకు పట్టా ఉన్నా భూమిని ఆన్‌లైన్‌ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆసైన్‌మెంట్‌ కమిటీ వేస్తే నమోదు చేయవచ్చని తహసీల్దార్‌ మునివేలు తెలిపారు. కలెక్టర్‌ స్పందిస్తూ కమిటీ అమలులో ఉంది చదువుకోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడి రైతు సమస్య పరిష్కరించండని ఆదేశించారు. అనంతరం స్ధానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను తనిఖీ చేశారు.

కలెక్టర్‌కే బురిడీ..

బొమ్మనహాళ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ఆ సమయంలో వైదాధికారి శ్రీలక్ష్మి ఆస్పత్రిలో లేరు. ఎక్కడికెళ్లారని అడిగితే.. చంద్రగిరిలో 104 వైద్య శిబిరానికి వెళ్లారని సీహెచ్‌ఓ ఈశ్వరయ్య చెప్పారు. ఆయన మాటలపై అనుమానం వచ్చిన కలెక్టర్‌.. చంద్రగిరిలో పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌ చేసి శిబిరం ఉందా.. డాక్టర్‌ ఉన్నారా లేరా అనేది చూసి చెప్పాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి రమేష్‌ వెళ్లి శిబిరం ఉందని చెప్పగా.. డాక్టర్‌తో మాట్లాడించాలని కోరారు. అయితే కార్యదర్శి ఎంఎల్‌హెచ్‌పీ రాధతో మాట్లాడించారు. తర్వాత అక్కడ డాక్టర్‌ లేరన్న విషయం తేటతెల్లమైంది. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు.

ఆన్‌లైన్‌ నమోదులో నిర్లక్ష్యం

కురువల్లి గ్రామంలోని అంగన్‌వాడీ –1 కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆ తర్వాత రెండో కేంద్రంలో తనిఖీకి వెళ్లినప్పుడు పిల్లల బరువు, ఎత్తు వివరాలను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడాన్ని గమనించారు. వాస్తవ స్థితికి భిన్నంగా నమోదు చేసినందుకు అంగన్‌వాడీ వర్కర్‌ పార్వతిని సస్పెండ్‌ చేయాలని ఐసీడీఎస్‌ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్ధానిక సచివాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్‌, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ, సర్వేయర్‌ రవితేజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement