అనంతపురం అర్బన్: హక్కుగా రావాల్సిన ప్రయోజనాలను సాధించుకునేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను చంద్రబాబు ప్రభుత్వం రోడెక్కించిందని యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. యూటీఎఫ్ రణభేరిలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు అధ్యక్షతన నాయకులు ఓబుళేసు, అర్జున్, హనుమంతరెడ్డి, మహేష్, గంగాధర్ తదితరులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, గౌరవాధ్యక్షుడు వెంకటరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేరుస్తుందని రెండేళ్లుగా ఎదురు చూశామన్నారు. అడపాదడపా కొన్ని బకాయిలు చెల్లించడం తప్ప పూర్తిస్థాయిలో సమస్యలు తీరలేదన్నారు. దీపావళి కానుక ఒక డీఏతో సరిపెట్టారన్నారు. సంక్రాంతి కానుకగా రూ.11,100 కోట్లు డీఏ బకాయిల చెల్లింపులకు కేటాయించినా 50 శాతం మందికి జమ కాలేదన్నారు. అన్నింటికీ మించి ఉద్యోగులకు 12వ పీఆర్‌సీ 2027 జూలై 1 నుంచి అమలుకావాల్సి ఉందన్నారు. 20 నెలలు గడిచినా ఈ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను నియమించలేదన్నారు. ఇప్పటికే 30 నెలల పాటు రావాల్సిన పీఆర్‌సీ ప్రయోజనాలను కోల్పోయామన్నారు. సకాలంలో డీఏలు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అక్టోబరు నుంచి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లించకపోవడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. సర్వీసులో ఉన్నవారికి సరెండర్ లీవులు ఇవ్వలేదన్నారు. ఎంప్లాయి హెల్త్ స్కీమ్ ఉదోగులకు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 అమలు చేయడంలో తీవ్ర తాత్సారం జరుగుతోందని మండిపడ్డారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్నా హామీని ప్రభుత్వం నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. అనంతరం డీఆర్‌ఓ మలోలకు నాయకులు వినతిపత్రం అందజేశారు. నిరాహార దీక్షకు ఏపీఎన్‌జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్, నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, శ్రీధర్, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసులు, ఇతర నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు లింగమయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు.
రెండేళ్లయినా చంద్రబాబు సర్కార్ చేసిందేమీ లేదు
నిరాహార దీక్షలో యూటీఎఫ్ నాయకులు


