బలవంతపు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బలవంతపు ప్రారంభం

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: వేసవి సెలవుల వేళ జూనియర్‌ కళాశాలల్లో తరగతులు బలవంతంగా ప్రారంభించారు. పరీక్షలు ముగిసి రెండు వారాలు కూడా కాకుండానే బుధవారం నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సుమారు 3,600 మంది విద్యార్థులుంటే తొలిరోజు 300 మంది కూడా హాజరుకాలేదు. వేలల్లో విద్యార్థులు ఉన్న కళాశాలల్లో హాజరు వందల్లో కూడా నమోదు కాకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో 600 మందికి పైగా విద్యార్థినులుంటే ఐదుగురు మాత్రమే వచ్చారు. తీరా 11 గంటల సమయంలో అధ్యాపకులు సమీపంలో ఉంటున్న విద్యార్థినులను బలవంతంగా పిలిపించుకోవడం కనిపించింది. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మండలాల్లో ఉన్న కళాశాలల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అధ్యాపకులు వాపోతున్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.

ఎక్కడుంటారు..

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలపై ఆధారపడుతుంటారు. వీరిలో చాలామంది హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం హాస్టల్‌ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, భోజనం–వసతి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలకు హాజరుకావడంలో ఇబ్బందులు పడుతున్నారు. ‘హాస్టల్‌ సదుపాయం లేకుండా ఎలా చదువుకుంటారు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వేసవి తీవ్రత, సెలవుల వాతావరణం కారణంగా విద్యార్థుల్లో నిరాసక్తత పెరిగింది. తల్లిదండ్రులు కూడా పిల్లలను పంపడంలో ఆసక్తి చూపడం లేదు.

జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల నిరాసక్తత

వేసవి సెలవుల్లో రాలేమంటున్న విద్యార్థులు.. ఆసక్తి చూపని తల్లిదండ్రులు

తొలిరోజు తూతూమంత్రంగా వచ్చిన విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement