● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్‌క్లాక్: బాధ్యతతో విధులు నిర్వర్తించినప్పుడే ఉద్యోగులకు సరైన గుర్తింపు ఉంటుందని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఇటీవల సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన పలువురు జూనియర్ అసిస్టెంట్లకు మంగళవారం తన చాంబర్‌లో ఉత్తర్వులను ఆమె అందజేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ నూతన సీఈఓ సుధాకరరెడ్డి, బదిలీ అయిన సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
నూతన సీఈఓ బాధ్యత స్వీకరణ
జెడ్పీ సీఈఓగా సుధాకరరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన శివశంకర్ మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఆయన సైతం మంగళశారం రిలీవ్ అయ్యారు. దీంతో ఇద్దరినీ జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన సుధాకరరెడ్డి ఒకే రోజు ఉద్యోగ విరమణ పొందడంతో ఇన్‌చార్జ్ బాధ్యతలను డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యకు అప్పగించారు. ఈ నేపథ్యంలో సీనియర్‌గా ఉన్న గుంతకల్లు డీడీఓ విజయలక్ష్మిని సీఈఓగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం.
ఆత్మ పీడీ ఉద్యోగ విరమణ
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పీడీగా, రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్‌టీసీ) ఇన్‌చార్జ్‌గా డీడీఏగా పనిచేస్తున్న పద్మలత మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ క్రమంలో ఆమెకు స్థానిక ఆత్మ కార్యాలయంలో చిరుసత్కారంతో అధికారులు, సిబ్బంది గౌరవంగా వీడ్కోలు పలికారు. కాగా, పద్మలత స్థానంలో ఆత్మ పీడీగా నారాయణనాయక్‌కు, ఎఫ్‌టీసీ ఇన్‌చార్జ్ డీడీఏగా శైలకుమారికి బాఽధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వ్యవసాయశాఖ ఏడీఏగా రోజాపుష్పలత
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏగా ఎల్.రోజాపుష్పలత మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలో పనిచేస్తున్న జీఎం అల్తాఫ్‌అలీఖాన్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి స్థానిక భూసార పరీక్షా కేంద్రం (ఎస్‌టీఎల్) ఏడీఏగా ఉన్న ఎల్.రోజాపుష్పలతకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ జేడీఏ ముదిగల్లు రవి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
యువకుడి ఆత్మహత్య
గుత్తి: స్థానిక నూతన నేసే కాలనీ సమీపంలోని గుట్ట కింద నారాయణస్వామి పొలంలోని వేప చెట్టుకు ఓ గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 28 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చు. షర్ట్ కూడా లేదు. బనియన్‌తో ఉన్నాడు. పరిసరాల్లో మద్యం ఖాళీ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు పడి ఉన్నాయి. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కాగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని గుత్తి పోలీసులు కోరారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కమిటీలో గోపా మచ్చా
అనంతపురం కల్చరల్: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురానికి చెందిన గోపామచ్చా నరసింహులు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తూరు అమ్మవారి శాలలో మంగళవారం రాత్రి ఆర్యవైశ్యలు ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేసి గోపామచ్చా నరసింహులును గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాజీ సీఎం, దివంగత రోశయ్యకు ఆప్తుడిగా ఉంటూ ఆర్యవైశ్యులు అభ్యున్నతికి గోపామచ్చా నరసింహులు చేసిన కృషిని కొనియాడారు. టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడిగా, వివిధ ఆలయాల కమిటీ సభ్యుడిగా నిస్వార్థ సేవలు అందించారన్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ది ఇయర్, మెల్విన్ జోన్స్ ఫెలో అవార్డులు సొంతం చేసుకున్నారన్నారు. సమావేశంలో అమ్మవారి శాల ఉపాధ్యక్షుడు పొలమడ రమేష్‌బాబు, తల్లం మురళీకృష్ణ, మాజీ కార్పొరేటర్ వెంకటకృష్ణ, తాటి లావణ్య మనోజ్, సురేష్, క్రిష్టం రఘు, ఆదిశేషయ్య, సిరిగుప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


