మాట తప్పడానికీ ఓ రోజు!
అనంతపురం కల్చరల్: మాటలతో ఎదుటి వ్యక్తులను ఫూల్స్‌ని చేయడం ఆల్ టైమ్ లేటెస్ట్ ట్రెండ్. ఈ క్రమంలోనే సరదాగా ఆటపట్టించే వేడుకగా ఏప్రిల్ 1న ‘ఆల్ ఫూల్స్ డే’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఇతరులను ఆటపట్టించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఫూల్స్ అవడం వెనుక ఓ చారిత్రక కథనం వ్యాప్తిలో ఉంది. మనం అనుసరిస్తున్న క్యాలెండర్ 16వ శతాబ్దంలో తొలిసారిగా ఫ్రాన్స్‌లో తయారైందని ఆ దేశ చరిత్ర చెపుతోంది. దాని ప్రకారం ఆ దేశ ప్రభువు చార్లెస్ 1564లో జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కావాలని ఆదేశించారంట. అయితే అప్పటి వరకూ ఏప్రిల్ 1న నూతన సంవత్సరంగా జరుపుకునే వారందరూ రాజాజ్ఞ ప్రకారం జనవరి 1న నూతన సంవత్సరంగా అంగీకరిస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకోవడం మొదలు పెట్టారు. దీంతో వారిని చూసి పాత పద్దతి (ఏప్రిల్ 1)ని అనుసరించేవారు ఆట పట్టిస్తూ హేళన చేసేవారు. మాటల్లోనే కాకుండా లోపల ఏ వస్తువూ పెట్టకుండా అందమైన బహుమతులను అందించేవారు. ఆ ప్యాక్ తెరచి చూసి అవాకై ్క వెర్రి ముఖం వేసే వారిని ఫూల్స్ అయ్యారంటూ నవ్వుకునేవారు. కాలక్రమంలో ఈ పద్దతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ దినం ‘ఆల్ ఫూల్స్ డే’గా స్థిరపడింది.


