అనంతపురం: అమరావతి ప్రాంత పరిసరాల్లో రాజధాని అంటూ సరికొత్త డ్రామాలకు చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు హర్షిస్తారా అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కార్యాలయాలూ హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్ల విభజన సమయంలో మెట్రో సిటీని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలనూ సమగ్రాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖపట్నం పాలనా రాజధానిగా నిర్ధారించినట్లు స్పష్టం చేశారు.
అవినీతిని చట్టబద్ధం చేయడానికే..
రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్న అవినీతిని చట్టబద్ధం చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని అనంత విమర్శించారు. అమరావతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లు అని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలం గడిపారని గుర్తు చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని అభివృద్ధి అంటూ రూ.48 వేల కోట్లు అప్పు చేశారన్నారు. గతంలోనే రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారని, ఇప్పుడు మళ్లీ 30 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, ఇంత భూమి ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారన్నారు. మరోసారి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయం కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ?
రాష్ట్ర విభజన ప్రక్రియ అన్యాయంగా జరిగిందని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసమే కాదు.. రైల్వే జోన్, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, పోలవరం, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమూ తీర్మానం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘అత్యంత వెనుకబడిన రాయలసీమ గురించి ఆలోచించరా? గతంలో కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీని తరలించేశారు. హైకోర్టును అమరావతికి పంపారు. ఎయిమ్స్ వస్తే మంగళగిరికి తీసుకెళ్లారు’ అని ఆవేదన చెందారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలన్నారు. కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, హంద్రీ–నీవాను విస్తరించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ పార్లమెంట్‌లో
పోరాటం చేయలేదా?
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో వైఎస్ జగన్ కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, విభజనకు వ్యతిరేకంగా ‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ’ అంటూ వైఎస్ జగన్ నిరసన తెలియజేశారని అనంత గుర్తు చేశారు. ఆరోజు తాను ఎంపీగా ఉన్నానని, ఇందుకు తానే సాక్షినని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కేశవరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్ పాల్గొన్నారు.
అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు
మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే మా పార్టీ ధ్యేయం
చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ
‘సీమ’ ప్రాజెక్టులపైనా ఉండాలి
రాజధానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి


