గాండ్లపెంట: మండల పరిధిలోని కటారుపల్లిలో ఆదివారం కుంభాభిషేకంతో యోగి వేమన ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఇంటి నుంచి మహిళలు జొన్నలను ఆలయానికి తీసుకువచ్చి కుప్పగా పోశారు. ఈ జొన్నలను ఆలయ పీఠాధిపతులు ఆలయం ఎదుట రాసిగా పోసి పసుపు, కుంకుమ కలిపి మహాశక్తి పూజ చేసిన అనంతరం గ్రామస్తులకు పంచి పెట్టారు. ఈ ప్రసాదం కొన్ని రకాల వ్యాధులకు మందుగా కూడా వినియోగిస్తారు.
వేమన సమాధి వద్ద పూజలు..
ఉత్సవాలను పురస్కరించుకుని వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరుకు చెందిన కళాకారుల నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేమన ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్లమెరవణి, పానక పందార్యము నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి పాటల కచేరీ ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి తెలిపారు. డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


