గార్లదిన్నె: శ్రీరామ నవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కొప్పలకొండ, పాత కల్లూరు, కల్లూరు (ఆర్‌ఎస్) గ్రామాల్లో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆయా గ్రామాల్లో ఇసుక మూట యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 120 కిలోల ఇసుక బస్తాను స్వయంగా ఎత్తుకుని 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా ప్రకటించారు. పాత కల్లూరులో 9 మంది యువకులు పోటీల్లో పాల్గొనగా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన సుధాకర్ మొదటి స్థానం, పాత కల్లూరుకు చెందిన అక్షింతల ఆనంద్ రెండో స్థానం, పామిడి మండలం వంకరాజుకాలువ నివాసి ఎర్రిస్వామి మూడో స్థానంలో నిలిచారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.
ఉత్కంఠగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పాత కల్లూరులో శుక్రవారం నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో 26 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో పామిడికి చెందిన నరేష్ మొదటి స్థానం, వంకరాజుకాలువకు చెందిన నరేంద్ర రెండోస్థానం, గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన హరి మూడో స్థానంలో గెలుపొందారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.


