విడపనకల్లు: ఆరు గాలం శ్రమంచి పశువుల కోసం పోగు చేసుకున్న గ్రాసం అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు, దూదేకుల కులాలకు చెందిన చిన్న, సన్న కారు రైతులందరూ కలసి గాజుల మల్లాపురానికి వెళ్లే మార్గంలో గడ్డి వాములు వేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఏక మొత్తంగా గడ్డివాములన్నింటినీ మంటలు చుట్టుముట్టడంతో రైతులు హాహాకారాలు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు రూ. 20 లక్షల విలువైన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనతో వన్నూరుసాహెబ్, వన్నూరువలి, ఓబులేసు, రహమత్ హుస్సేన్, చౌడిక హనుమంతు, చౌడిక యల్లప్ప, చౌడిక రామయ్య, బొమ్మయ్య గారి చిన్న మారెయ్య, మహేష్, రాముడు, పెన్నయ్య, సూరి, పంపా, వన్నారెడ్డి, హనుమంతు, ఓబులేసు, రంజాన్, యల్లప్ప మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిలో వన్నూరు సాహెబ్‌కు చెందిన ఓ ఎద్దును సైతం మంటలు చుట్టుముట్టడంతో 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. అలాగే మాళాపురం గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు నాగన్న గౌడుకు చెందిన నర్సరీ కాలిపోయింది.
రైతులను ఆదుకోవాలి : విశ్వ
పాల్తూరులో దాదాపు 20 మంది రైతుల గడ్డి వాములు కాలిపోవడం చాలా బాధాకరమని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పాల్తూరులో వేసవిలో గడ్డి వాములకు నిప్పు పడుతూనే ఉందని, ఫలితంగా రైతులు నష్టపోతూనే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని సమగ్ర విచారణ చేపట్టి ఎవరైనా కావాలనే ఈ దుర్ఘటనకు పాల్పడి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకరూ పరిహారంతో పాటు పశుగ్రాసాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


