● గోనేహాళ్ క్రాస్ సమీపంలో ఐచర్, బైక్ ఢీ
● ఒకరి దుర్మరణం
● 14 మందికి గాయాలు
బొమ్మనహాళ్: అతి వేగం నిేండు ప్రాణాన్ని బలిగొంది. మరో 14 మందిని తీవ్ర గాయాల పాలు చేసింది. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గౌనూరు గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ (20) శుక్రవారం ఉదయం తన పత్తి పొలంలో పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి చేరుకున్నాడు. అప్పటికే కణేకల్లు క్రాస్ వైపు నుంచి బొమ్మనహాళ్ వైపుగా మొక్కజొన్న లోడ్‌తో అతి వేగంగా వస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి వెంటనే ద్విచక్ర వాహనాన్ని కుడి వైపుగా మళ్లించాడు. ఆలస్యంగా ద్విచక్ర వాహనదారుడిని గుర్తించిన ఐచర్ డ్రైవర్ సైతం నిర్లక్ష్యంగా తన వాహనాన్ని కుడి వైపుగా తిప్పాడు. దీంతో వాహనదారులిద్దరూ వేగాన్ని నియంత్రించుకోలేక కొద్ది దూరం సమాంతరం వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టుతో పాటు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మన్‌ను ఐచర్ ఢీకొని బోల్తాపడింది. ఘటనలో ఐచర్ వాహనం కింద నలిగి ఉప్పర నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం విరిగి పడిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామానికి చెందిన ఐచర్ వాహన డ్రైవర్ బసవరాజుతో పాటు హమాలీలు మాదిగ చంద్రశేఖర్, మాదిగ మారెన్న, మాదిగ ఉమేష్, హరిజన ఉమేష్‌తో పాటు మరో 10 మంది గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్‌ఐలు నాగమధు, గురుప్రసాదరెడ్డి, బొమ్మనహాళ్ ఏఎస్‌ఐ విజయ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వీరేష్ మృతదేహాన్ని బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి ఉలిగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


