● కేవీఐసీ చైర్మన్ మనోజ్‌కుమార్
అనంతపురం టౌన్: దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్‌కుమార్ పిలుపునిచ్చారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతివృత్తి కళాకారులకు శుక్రవారం అనంతపురంలోని కొత్తూరు జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పనిముట్లను పంపిణీ చేసి, మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న చేతివృత్తిదారులు ఆధునిక యంత్రాల సాయంతో మరింతగా రాణించాలన్నారు. ఖాదీ కేవలం ఒక వస్త్రం కాదని అది ఒక ఉద్యమంతో కూడిన ఆలోచన అన్నారు. సంప్రదాయ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీఈపీ పథకం కింద ప్రత్యేక రాయితీలతో కూడిన రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీఐసీ డిప్యూటీ సీఈఓలు మదన్‌కుమార్‌రెడ్డి, నల్లమత్తు, డైరెక్టర్లు క్రీప్, మోహన్‌రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసయాదవ్, చేనేత జౌళీశాఖ ఏడీ వరప్రసాద్, డీఓ బసవరాజు, కేవీఐసీ రవి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి
యోగి వేమన తిరుణాల
గాండ్లపెంట: విశ్వ కవి యోగి వేమన తిరుణాల ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగి వేమన ఆలయంలో ఏటా ఉగాది తర్వాత వారం రోజులకు తిరుణాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తిరుణాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30వ తేదీ పానక పందేరం, బండ్ల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు, 31న ఉట్ల తిరుణాల, అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పీఠాధిపతి తుంగా చెన్నారెడ్డి తెలిపారు.


