రాయదుర్గం: ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మండే ఎండలో పనిచేయడం ఎవరికై నా కష్టమే. వేసవి సీజన్‌లో ఉపాధి కూలీలు పనిచేసే చోట ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు టార్పాలిన్లతో టెంటు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవి అలవెన్స్ కింద గడ్డపారకు రూ.10, తట్టేందుకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున అందజేయాలి. వీటితో పాటు పనిప్రదేశాల్లో నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. పని ప్రదేశంలో గాయమైతే ప్రథమ చికిత్స చేయడానికి కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత ప్రభుత్వాలు ఈ సౌకర్యాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కూలీలు మండుటెండలోనే పనిచేయాల్సి వస్తోంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చెట్ల కిందకు వెళ్తున్నారు. ఒక్కోసారి ఏకధాటిగా ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురవుతున్న ఘటనలూ లేకపోలేదు. మజ్జిగ ప్యాకెట్లు– తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
పని ప్రదేశాల్లో కనిపించని
సౌకర్యాలు
40 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
కూలీలకు పొంచిఉన్న
వడదెబ్బ ముప్పు
అందుబాటులో లేని మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్
ఇబ్బందులు పడుతున్నాం
ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవు. భగభగ మండుతున్న ఎండలకు వడదెబ్బ తగలడం, జ్వరాలు, విరేచనాలతో చాలామంది కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. పని ప్రదేశాల వద్ద టెంటు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కనిపించవు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల గురించి తెలుసుకుని, పరిష్కరించాలి. – హనుమంతు, కూలీ,
బండూరు, బొమ్మనహాళ్ మండలం
సౌకర్యాలు కల్పిస్తాం
ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలు ఎండాకాలం ముగిసేవరకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 6.30 నుంచి 11 గంటల్లోపు పనులు చేయాలి. పనులు అయిపోగానే విశ్రాంతి తీసుకోవాలి. వైద్య సామగ్రి కోసం ఇండెంట్ పెట్టాం. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.
– సలీం బాషా, పీడీ, డ్వామా


