తాడిపత్రిటౌన్: మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం– అధికార పార్టీ నేతల వ్యవహారశైలితో బుధవారం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు మున్సిపల్ స్థలం ఆక్రమించారంటూ కట్టడం తొలగించేందుకు చేసిన హడావుడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకుల నాగిరెడ్డి పుట్లూరు రోడ్డులో భవన నిర్మాణం చేపట్టారు. బుధవారం మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి హిటాచీతో అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించినందున తొలగించేందుకు వచ్చామని అధికారులు తెలపగా.. తాను ఎటువంటి ఆక్రమణకూ పాల్పడలేదని స్పష్టం చేశారు. అయినా అధికారులు వినలేదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫళంగా తొలగిస్తామనడం అన్యాయమని ప్రశ్నించారు. ఇలా వాగ్వాదం జరుగుతుండగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు. కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉందని నాగిరెడ్డిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వ్యాపారం చేసుకునే నీకు రాజకీయాలెందుకంటూ రెండు, మూడు గంటలు స్టేషన్‌లోనే ఉంచారు. ఈలోపు మున్సిపల్ అధికారులు భవనం మెట్లను హిటాచీతో తొలగించి వెళ్లిపోయారు. న్యాయం చేయాల్సిన అధికారులు.. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని నాగిరెడ్డి వాపోయారు. స్టేషన్ సమీపంలో కూడా ‘పచ్చ’ మూకల గుంపు తిరుగుతుండటం కనిపించింది. మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నాయకులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికారులను, పోలీసులను ఉసిగొలుపుతున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.
భయం.. భయం..
తాడిపత్రిలో ‘పచ్చ’ నేతల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా అలజడులు సృష్టించేందుకు వారు కుయుక్తులు పన్నడమే ఇందుకు కారణం. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆక్రమణల పేరిట తొలగింపు సమయంలో అధికార పార్టీ శ్రేణులు అదునుకోసం వేచిచూస్తున్నట్టుగా గుంపుగా వచ్చి అటుఇటు తిరుగుతూ కనిపించారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత
వైఎస్సార్‌సీపీ నేత
భవన నిర్మాణ
తొలగింపునకు చర్యలు
అధికారులు,
పోలీసులను ఉసిగొల్పిన అధికార పార్టీ నేతలు!


