తాడిపత్రిటౌన్: కోనుప్పలపాడులో స్కూలు బస్సు దిగి ఇంటికెళ్తున్న బాలుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. బంధువుల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులు. వీరి కుమారుడు వేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజుమాదిరిగానే బుధవారం పాఠశాల ముగియగానే వేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి వేచి ఉన్నాడు. బస్సు ముందుకెళ్లగానే.. నడుచుకుంటూ వస్తున్న వేమచంద్రను ముసుగు వ్యక్తి అపహరించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికెళ్లాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు.. స్కూలు బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా ద్విచక్రవాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తండ్రి గోవిందుకు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. ఎవరిౖపైనెనా అనుమానం ఉందా అని ఆరా తీసిన తర్వాత.. బంధువు అయిన వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వినోద్ తన స్నేహితుని ద్వారా బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ రోహిత్‌కుమార్‌తో పాటు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్‌ఐలు పోలీస్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కుందనకోట గ్రామంలో కిడ్నాప్‌నకు ఉపయోగించిన ద్విచక్రవాహనం గుర్తించినట్లు తెలిసింది.


