అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించడంతో పాటు నిష్పక్షపాతంగా లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నిధులు వెచ్చించాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో వ్యయానికి సంబంధించి ఎస్సీలకు 17.08, ఎస్టీలకు 5.53 శాతం కచ్చితంగా ఖర్చు చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీ్త్ర నిధి రుణాలు మంజూరు చేయాలన్నారు. కొత్త సామాజిక పింఛన్ల మంజూరు క్రమంలో సదరం క్యాంపులపైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి పథకం కింద నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష్యానికి మించి పనులు కల్పించాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలన్నారు.
పనులు పూర్తి చేయాలి..
పీఎంఏజీవైకు సంబంధించి ప్రాజెక్టు మదింపు – సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంఏజీవై కింద 11 గ్రామాల్లో మూడు దశల్లో పనులు చేపట్టారన్నారు. అందులో తొలిదశలో మంజూరైన 38 పనులు, రెండవ దశలో మంజూరైన 79 పనులు, మూడవ దశలో మంజూరైన 32 పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


