● ఎమ్మెల్యే వర్సెస్ మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ భర్త
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో వే బ్రిడ్జి (లారీ కాటా) విషయంలో బుధవారం చైర్‌పర్సన్ బల్లా పల్లవి భర్త బల్లా సురేష్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయకమునుపే అంటే గత జూలైలోనే ఎమ్మెల్యే మనుషులు వేబ్రిడ్జి టెండర్ దక్కించుకున్నారు. ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున రెండేళ్లకు ఒకసారి 10 శాతం పెంపు చేసేలా ఐదేళ్ల పాటు టెండర్ కై వసం చేసుకున్నారు. మార్కెట్ యార్డుకు అంతో ఇంతో ఆదాయం వచ్చే వేబ్రిడ్జిని వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే మనుషులు ముందుగానే దక్కించుకున్నట్లు చెబుతున్నారు. అయితే 40 టన్నుల సామర్థ్యం ఉన్న వేబ్రిడ్జిని 100 టన్నుల సామర్థ్యానికి పెంచేలా ప్రస్తుత చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సామర్థ్యం పెంచి ఏడాదికి ఒకరికి పాలక వర్గం సభ్యులకే టెండర్ వస్తే వారికి కూడా కొంత ప్రయోజనం ఉంటుందని చైర్‌పర్సన్ వర్గీయులు ఆలోచన చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే దీనిపై నిలదీసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై చైర్‌పర్సన్ భర్త బల్లా సురేష్, ఎమ్మెల్యే దగ్గుపాటి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై చైర్‌పర్సన్ బల్లా పల్లవిని వివరణ కోరగా... అలాంటిదేమీ లేదన్నారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి అవాస్తవాలు, అభిప్రాయభేదాలు ఉన్నట్లు సృష్టించే ప్రచారం చేస్తున్నారంటూ కొట్టిపారేశారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.


