కూడేరు: దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధిచెందిన శివాలయాల్లో ఒక్కటిగా నిలిచిన కూడేరులోని శివపార్వతుల స్వయం భు జోడులింగాల సంగమేశ్వరుడి క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన ప్రతులను సోమవారం ఆలయ ఈఓ రమేష్‌బాబు విడుదల చేశారు. కార్యక్రంమలో అర్చకులు, ఆలయ సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 27న బండారు (బ్రాహ్మణ) వంశీకుల ఆధ్వర్యంలో శివపార్వతులకు పుణ్యావాచనం, గంగపూజ, కలశ స్థాపన పూజలు ఉంటాయి. 28న రాత్రి 7 గంటలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శేష వాహన సేవ, 29న ఈడిగ సంఘం ఆధ్వర్యంలో వ్యాఘ్ర వాహన సేవ, 30న వైశ్య సంఘం ఆధ్వర్యంలో నెమలి వాహన సేవ, 31న కమ్మ సంఘం ఆధ్వర్యంలో నంది వాహన సేవ ఉంటుంది. ఏఫ్రిల్ 1న వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై ఆదిదంపతులు దర్శనమివ్వనున్నారు. 2న ఉదయం 7 గంటల్లోపు మడుగు తేరు, సాయంత్రం బ్రహ్మరథోత్సవం ఉంటుంది. 3న కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అశ్వ వాహన సేవ, పారవేట ఉత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
● శత జన్మదిన వేడుక
బొమ్మనహాళ్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం శత జన్మదిన వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలుకా కరడల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మకు 1940లో బొమ్మనహాళ్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పాల్తూరు హీరేమఠ సాంబయ్యతో వివాహమైంది. నలుగురు కుమారులు, నలుగురు కుమారైలు ఉన్నారు. అలాగే పది మంది మనవళ్లు, పది మంది మనవరాళ్లూ ఉన్నారు. ఇటీవల ఆమె పెద్ద కుమారుడు మృతి చెందాడు. శతాధిక వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్న పార్వతమ్మను గ్రామస్తులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


