● కసాపురంలో ముగిసిన ఉగాది ఉత్సవాలు...
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ తీసుకెళ్లారు. అక్కడ ఈఓ ఎం.విజయరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లంకాదహనం వేడుకను ప్రారంభించారు. తిరిగి అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని అక్కడ లంకాదహనం వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకను చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి.
లంకా దహనం కార్యక్రమాన్ని
ప్రారంభిస్తున్న ఆలయ సిబ్బంది
ఒంటె వాహనంపై కొలువు దీరిన
నెట్టికంటి ఆంజనేయస్వామి


