హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్‌ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్‌బాబుయాదవ్‌ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్‌, ముత్తలూరు నరేష్‌ చౌదరి, న్యూ వికాష్‌ స్కూల్‌ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు.

నిరుద్యోగ యువతకు దగా

అనంతపురం అర్బన్‌: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలను చూపించడం యువతను మభ్యపెట్టే మరో ప్రయత్నమేనని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా తక్కువ సంఖ్యలో పోస్టులను ప్రకటించడం దారుణమన్నారు. మొక్కుబడిగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామీని రెండేళ్లవుతున్నా అమలు చేయలేదని విమర్శించారు. సమగ్ర నియామక ప్రణాళికతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement