శెట్టూరు: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం కేవీకే కో–ఆర్డినేటర్ చెన్నరాయుడుతో పాటు శాస్త్రవేత్తలు, వ్యసాయ అధికారులు పరిశీలించారు. శెట్టూరు, అయ్యగార్లపల్లి, కనుకూరు గ్రామాల్లో గాలీవానకు దెబ్బతిన్న మొక్కజొన్న, బీర, మామిడి తోటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం మామిడిలో చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలను రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు మల్లికార్జున, శిరీష వివరించారు. మామిడిలో పూత, పిందె రాలిపోతున్న సమస్య నివారణకు ప్లానోఫిక్స్, 19:19:19 ను పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వాసుకీరాణి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ముదిగల్లు సమీపంలో చిరుత
కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ సమీపంలోని కంకర మిషన్ వద్ద ఉన్న ఓ గుట్టపై శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచారించాయి. గుట్టకు ఆనుకుని పలువురు నివాసం ఉంటున్నారు. చిరుతను గమనించిన వారందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుతల సంచారంపై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించినా వాటిని బంధించే చర్యలు చేపట్టలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని కోరుతున్నారు.


