● 20 వేల పోస్టుకార్డులు వితరణ చేసిన డాక్టర్ వసంత్
కళ్యాణదుర్గం: ఆర్డీటీని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి పలువురు తమ వంతు సాయంగా చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వసంత్ 20 వేల పోస్టుకార్డులను డాక్టర్ తలారి రంగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ... ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆర్డీటీ ఆవశ్యకతను వివరించినట్లు గుర్తు చేశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ కోసం చేపట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి, ఎంఎస్ హనుమంతరాయుడు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, వికలాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పాతలింగ, ఎనుములదొడ్డి సర్పంచ్ విజయ్, నాయకులు మల్లాపురం మల్లి, హుళికల్లు మల్లి, నాగిరెడ్డిపల్లి మారుతి, మాకొడికి నాగేంద్రతో పాటు పలువురు సానుభూతిపరులు పాల్గొన్నారు.


