● మాజీ మంత్రి శైలజానాథ్
శింగనమల: అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. పంటలు చేతికి అందే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఉదారంగా స్పందించి రైతులకు మంచి జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, ఉద్యానపంటలు చేతికి అందే సమయంలో పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు. కనీసం పంట కోత ఖర్చులు కూడా చేతికి అందే పరిస్థితి లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను శాసీ్త్రయంగా రూపొందించాలని అధికారులను కోరారు. పంటను బట్టి ఎకరాకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తక్షణ సాయం అందించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతుల పాత రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు తదుపరి పంట సాగుకు వడ్డీలేని కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు పరిహారం అందేలా చూడాలని, లేకుంటే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.


