● భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ముందు భాగంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కసాపురం గ్రామస్తులు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ వేద పండితులు వారికి పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులకు సేవా పురస్కారాలు, మెమొంటోలను అందజేశారు. తర్వాత ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పుర వీధుల్లో స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.


