న్యూస్‌రీల్
● ఉగాది వేడుకల్లో కలెక్టర్ ఆనంద్
అనంతపురం కల్చరల్: మంచి సంకల్పంతో చేసే పనులతోనే విజయం సాధించగలమని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిపించేందుకు అందరం శ్రమిద్దామని కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది ఉత్సవాలు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగాయి. కలెక్టర్ ఆనంద్‌తో పాటు పలు శాఖల అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కవులు జూటూరు తులసీదాసు, సీతారామప్రసాద్, నర్సిరెడ్డి, నాగవేణి, రాఘవేంద్ర తదితరులు కవి సమ్మేళనంలో కవితా గానంతో తెలుగుదనాన్ని చాటారు. విద్యార్థుల భక్తిగీతాలాపన, శాసీ్త్రయ నృత్యాలు, జానపద నాట్యాలు అలరించాయి. వేదపండితులు సీతరామమోహన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాలకు చెందిన అర్చక పురోహితులు ప్రసాద్, జగన్నాథమయ్య, మడకశిర పద్మనాభ భట్టార్, చాగంటి లక్ష్మణాచార్యులను నగదు బహుమతితో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బల్లా పల్లవి, నాయి బ్రాహ్మణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్, రజక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆదినారాయణ, కొండన్న, డీఆర్వో మలోల, ఎస్‌డీసీ ఆనంద్, టూరిజంశాఖ అధికారి జయకుమార్, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆన్‌సెట్ శ్రీనివాసులు, డ్వామా పీడీ సలీం బాషా, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


