అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ ఎన్‌వీఆర్ జ్యోతికుమార్‌కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బాధ్యతలతో కూడిన వీసీగా ఇటీవల జ్యోతికుమార్ నియామకమయ్యారు. గత 20 నెలలుగా ఇన్‌చార్జి వీసీ పాలనలోనే ఎస్కేయూ కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. దీంతో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో.. కేవలం సాధారణ పాలనా వ్యవహారాలు మాత్రమే ఇన్‌చార్జ్ వీసీ నిర్వహిస్తూ వచ్చారు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వాస్తవానికి మూడు నెలల్లోపే వీసీ వస్తారని ఇన్‌చార్జి వీసీని నియామకం చేశారు. 20 నెలలు జాప్యం చేస్తూ రావడంతో వర్సిటీ అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. కనీసం స్నాతకోత్సవం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డిగ్రీ పట్టాలు తీసుకోలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇన్‌అడ్వాన్సెడ్ కింద ఐదు రెట్లు అదనపు ఫీజు చెల్లించి స్నాతకోత్సవ డిగ్రీ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కొత్త వీసీ వెంటనే స్నాతకోత్సవాన్ని నిర్వహించి డిగ్రీలు ప్రదానం చేయాల్సి ఉంది.
పదవుల మార్పు అనివార్యమేనా
ఎస్కేయూలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రిజిస్ట్రార్, రెక్టార్ హోదాలో కొనసాగుతున్నారు. తాజాగా వీసీ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు ఉన్నత స్థాయిలో హోదాల్లో ఉండడం కష్టసాధ్యం. దీంతో సామాజిక వర్గాల సమీకరణలో రిజిస్ట్రార్, రెక్టార్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరిని తొలగించే నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వీసీకి అతిపెద్ద సవాలుగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు సీనియర్ ప్రొఫెసర్ కావడంతో రెక్టార్‌గా అవకాశం కల్పించారు. రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ రమేష్‌బాబును రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. సామాన్య ఉద్యోగికి ఏకంగా రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టడంపై కొంత మంది ప్రొఫెసర్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇటీవల రూ.43 లక్షల అరియర్స్ బెనిఫిట్స్ రావాలని ఏకంగా ఆడిటింగ్‌కు బిల్లులు పెట్టి వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. యూజీసీలో లేని పోస్టు అయిన రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు అరియర్స్ ఇవ్వాలని రిజిస్ట్రార్ హోదాలో కోరడం వివాదాస్పదమైంది.
పీజీ అడ్మిషన్లు లేని పరిస్థితి
రాయలసీమలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మనుగడ చంద్రబాబు ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకమైంది. 2,500 పీజీ సీట్లు ఉంటే తాజాగా 300 మంది విద్యార్థులు కూడా అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు లేనట్లయితే ఎస్కేయూ ఇప్పటికే మూసివేసే పరిస్థితి ఉండేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీజీ కోర్సుల్లో సున్నా అడ్మిషన్లు పొందిన విభాగాలు 8 ఉన్నాయి. ఈ విభాగాలను బలోపేతం చేయడం, లేకపోతే. కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకరావడం కొత్త వీసీకి అతి పెద్ద సవాలుగా మారనుంది.
జాప్యాన్ని అరికట్టాలి
డిగ్రీ సర్టిఫికెట్లు సకాలంలో జారీ చేయని పరిస్థితి కూడా నూతన వీసీకి పెను సవాల్ కానుంది. నెలల తరబడి విద్యార్థులు తిరిగినా సర్టిఫికెట్లు జారీ చేయని తీరు ఎస్కేయూ అధికారులకే చెల్లు. ఇప్పటికీ మ్యానువల్ వ్యవస్థనే ఎస్కేయూలో నడుస్తోంది. దీంతో సర్టిఫికెట్ జారీ చేయాలంటే కనీసం నాలుగు, ఐదు సెక్షన్లలో ఫైలు తిరగాలి. ఎక్కడో ఒక చోట ఆ ఫైల్ ఆగడం జాప్యానికి ప్రధాన కారణమవుతోంది. డిగ్రీ సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని అరికట్టాలంటే ఆటోమేషన్ విధానం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మురిగిపోనున్న పీఎం ఉష నిధులు
ఎస్కేయూకు న్యాక్ బీ గ్రేడ్ రావడంతో ఐదేళ్ల కాలానికి రూ.20 కోట్ల మేర పీఎం ఉష నిధులు అందాయి. వాస్తవానికి ఏ గ్రేడ్ ఉంటే రూ.100 కోట్ల నిధులు అందేవి. ఆరేళ్ల క్రితం కూడా అందిన రూ.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మూడేళ్ల క్రితం మరో రూ.20 కోట్ల నిధులు అందాయి. వీటిని ఈ నెలాఖరులోపు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నిధులు వెచ్చించే స్వీయ నిర్ణయం ఇన్‌చార్జ్ వీసీకి లేకపోవడంతో పూర్తి స్థాయి బాధ్యతలతో కూడిన వీసీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే నెలలు గడుస్తున్నా నియామకం కాకపోవడంతో రెండు నెలల క్రితం హడావుడిగా పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ఏడాదిపైగా సమయం పడుతుంది. దీంతో నూతనంగా వీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుగా పీఎం ఉష నిధుల వెచ్చింపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ఏడాది పాటు గడువు పొడిగించాలని కోరాల్సి ఉంది. అనుమతి వస్తే రూ.20 కోట్ల నిధులు మురిగిపోకుండా ఉంటాయి.
ఎస్కేయూ నూతన వీసీ జ్యోతికుమార్ ముందు ఎన్నో సవాళ్లు
20 నెలలుగా కొత్త ప్రాజెక్ట్‌లు లేవు
నయా పైసా యూజీసీ నిధులు లేవు
మొత్తం 3 వేల పీజీ సీట్లకు గాను.. కేవలం 280 అడ్మిషన్లు
10 పీజీ కోర్సుల్లో సున్నా అడ్మిషన్లు
రూ.20 కోట్ల రూసా నిధులు ఖర్చు పెట్టలేని పరిస్థితి


