పిచ్చికుక్క దాడి... 15 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడి... 15 మందికి గాయాలు

Mar 18 2026 9:38 AM | Updated on Mar 18 2026 9:38 AM

రాయదుర్గంటౌన్‌: స్థానిక లక్ష్మీబజార్‌లోని కణేకల్లు మార్గంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. మంగళవారం మధ్యాహ్నం రుచి హోటల్‌ వద్ద నుంచి బాలాజీ టీ పాయింట్‌ వరకూ ఎదురు పడిన దాదాపు 15 మందిపై దాడి చేసి కరిచింది. బాధితుల్లో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. కాళ్లు, చేతులపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిలో పట్టణానికి చెందిన వారితోపాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది ఇళ్లకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రయాదవ్‌ వెంటనే స్పందించి పిచ్చికుక్కను బంధించేందుకు సిబ్బందిని పంపించారు.

గ్యాస్‌ ధరల పెంపుపై ఆగ్రహం

రాప్తాడు రూరల్‌: రోజురోజుకూ పెంచుతున్న వంట గ్యాస్‌ ధరలు తగ్గించి, బుకింగ్‌ చేసి ప్రతి ఒక్కరికీ సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం రాప్తాడులో మహిళు ఆందోళన చేపట్టారు. ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి గౌని శారద మాట్లాడుతూ.. వంటగ్యాస్‌ మహిళల నిత్య జీవితంలో అత్యంత అవసరమైందన్నారు. గ్యాస్‌ లేకుండా రోజువారీ జీవనం కష్టమవుతోందన్నారు. సిలిండర్‌ బుకింగ్‌ సమయంలో సర్వర్‌ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బుకింగ్‌ చేసిన తర్వాత కూడా సిలిండర్‌ రావడానికి 3–4 రోజులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డెలివరీ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గ్యాస్‌ ధరలను తగ్గించి, సకాలంలో సరఫరా చేయాలని, అదనపు డబ్బు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు శేషమ్మ, తులసమ్మ, ప్రశాంతి, రసూల్‌బీ, సుజాత, ఓబులమ్మ, చిట్టెమ్మ, రమీజా, కుళ్లాయమ్మ, మాధవి, ముత్యాలమ్మ, రేష్మ, రామాంజనమ్మ, భాగ్యమ్మ, ఆచారమ్మ పాల్గొన్నారు.

18 గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం

పామిడి: మండలంలోని ఎద్దులపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 18 వంట గ్యాస్‌ సిలిండర్లను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు మంగళవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామంలోని బసవరాజు కుమారుడు వీరభద్రప్ప తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 18 గ్యాస్‌ సిలిండర్లను గుర్తించి, సీజ్‌ చేశారు. వీరభద్రప్పపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ కంబక్క, వీఆర్వో భాగ్య పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో

ఇరువర్గాల ఘర్షణ

అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొనడంతో మంగళవారం అక్కడ దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన అనసూయ గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ ఉన్న మరో వర్గానికి చెందిన వారు ఆమైపె మరోసారి దాడికి పాల్బడ్డారు. ఆ సమయంలో ఇరు వర్గాల వారు రెచ్చిపోయి పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement