కసాపురంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కసాపురంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

Mar 18 2026 9:38 AM | Updated on Mar 18 2026 9:38 AM

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు

గుంతకల్లు రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా తరలి రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా, గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి తాగునీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం రోజూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

19న గ్రామోత్సవం

ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న గ్రామోత్సవం ఉంటుంది. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి శమీ వృక్షం వరకూ ఊరేగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మంటపం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం ఉంటుంది.

20న రథోత్సవం

ఈ నెల 20న స్వామి వారి రథోత్సవం ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాంగ హోమం, సంప్రోక్షణ, బలిహరణ తదితర పూజల అనంతరం విశేష పుష్పాలంకరణలో తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చి పురవీధుల్లో భక్తులు లాగనున్నారు.

21న లంకాదహనం

ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న లంకాదహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ సమీపంలోని కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంజనేయస్వామి చేతుల మీదుగా లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఎదుట పోలీస్‌ ఔట్‌ పోస్టు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు రెండు గంటల పాటు జరిగే లంకాదహనం కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement