● వైఎస్సార్‌టీఏ నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డీఆర్వో మలోలను నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, నాలుగు డీఏలను పెండింగ్‌లో ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసించారు. ఆర్థిక సమస్యలతో పాటు యాప్స్ పేరుతో ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతూ బోధనకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డీఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, వెంకటరమణ, జిల్లా నాయకులు ఓబిరెడ్డి, ప్రసాద్, కృష్ణానాయక్, వెంకటరెడ్డి ఉన్నారు.


