శ్మశాన వాటిక కోసం ఎస్సీలు పోరాడాల్సిన దౌర్భగ్య స్థితిని ప్రస్తుత పాలకులు కల్పించడం సిగ్గుచేటంటూ ఏస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ధ్వజమెత్తారు. ఎస్సీ కాలనీలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలంటూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దళితులు చనిపోతే వారిని పూడ్చేందుకు ఆరు అడుగుల స్థలం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎస్సీ కాలనీలకు శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. నాయకులు కుంటిమద్ది ఓబులేసు, సుగమంచి శ్రీనివాసులు, శివిజాల అంజి, టీవీరెడ్డి, ఎంసీ కుళ్లాయప్ప, ఆలూరు గంగాధర్, పూసల హనుమంతు, వసంతకుమార్ పాల్గొన్నారు.


