● అనంతపురం నగరంలోని రాంనగర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దాదాపు ఐదేళ్లుగా ఈ సమస్య ఉంది. ఇతరత్రా జీవనశైలి జబ్బులు కూడా ఉన్నాయి. మార్నింగ్ వాక్ చేయాలంటే మోకాళ్ల నొప్పులతో సాధ్యపడడం లేదు. ఎందరో వైద్యులకు చూపించాడు. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత నివారణ దొరకలేదు. ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. రేపోమాపో ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
● హిందూపురంలోని ఓ ప్రైవేటు హోటల్ నిర్వాహకుడి వయసు 42 ఏళ్లు. ఐదేళ్లుగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. ఆర్థో డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. అయితే రోజులో గంటల తరబడి నిల్చొని ఉండటంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఏడాదిగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో బెంగళూరులోని ఆస్పత్రులను సందర్శిస్తున్నాడు.
అనంతపురం /సాక్షి, పుట్టపర్తి
నిల్చోవాలన్నా..కూర్చోవాలన్నా.. చివరకు కదలాలన్నా.. మోకాళ్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి మోకాళ్లు ఇటీవల కాలంలో మొరాయిస్తున్నాయి. జీవన శైలిలో మార్పులు, ఫాస్ట్‌ఫుడ్ పేరుతో తినే తిండి, మినరల్ వాటర్ పేరుతో తాగే నీరు సైతం రసాయనాలతో కూడి ఉండటంతో పాటు వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో 40 ఏళ్లకే చాలా మంది మోకాలి నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పితో బాధపడేవారు ఉన్నారు. ఏ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చూసినా సగటున రోజుకు 50 మంది రోగులు వెళ్తున్నారు. అందులో సగానికి పైగా 40 ఏళ్ల వయసు వారే ఉండటం గమనార్హం. మోకాళ్ల నొప్పి, ఎముకల అరుగుదల, జాయింట్ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. కుటుంబ బాధ్యతలు మోసే వయసులోనే మోకాళ్ల నొప్పితో నడవలేని స్థితికి చేరుకుంటున్నారు. ఫలితంగా శారీరకంగా కోలుకోలేక కుటుంబ భారం మోయలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
● జీవన శైలిలో మార్పుల కారణంగా మోకాళ్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది.
● ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు. వ్యాయామం లేకపోవడం
● ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఊబకాయం
● సూర్యరశ్మి లోపంతో విటమిన్–డి కొరత, కాల్షియం లోపం
● రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు
● వయసు పెరిగే కొద్దీ శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గిపోవడం కూడా మోకాళ్ల అరుగుదలకు దారి తీస్తుంది.
అందుబాటులో ఆధునిక వైద్యం..
మోకాళ్ల సమస్యలకు ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలోనే ఫిజియోథెరపీ, ఇంజక్షన్లు వంటి చికిత్సలతో నొప్పిని నియంత్రించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు వైద్యులు సూచిస్తారు.
రోబోటిక్ సర్జరీ..
ఇటీవల కాలంలో రోబోటిక్ ‘నీ రీప్లేస్‌మెంట్’ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రక్త స్రావం, నొప్పి తక్కువగా ఉండటంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మొరాయిస్తున్న మోకాళ్లు
నాలుగు పదులకే అరుగుతున్న కీళ్లు
కూర్చోలేక... నడక లేక
అల్లాడిపోతున్న బాధితులు
ఒకేచోట కూర్చొని ఉండటంతో
ఇతర అవయవాలకూ ముప్పు
సర్జరీలకు జంకుతున్న బాధితులు
మోకాళ్ల నొప్పిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నొప్పుల కారణంగా కాలినడక (వాకింగ్) మానేస్తున్నారు. దీంతో శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. రోజుల వ్యవధిలోనే మెదడు చురుకుదనం తగ్గి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కదల్లేని వారు నీరు కూడా తక్కువ తీసుకోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
కారణాలెన్నెన్నో..


