అనంతపురం: టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం కడదరకుంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు పుష్పలత అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సోమవారం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.
వ్యవసాయ అభివృద్ధికి చర్యలు
బుక్కరాయసముద్రం: వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం కొట్టాలపల్లిలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు కొత్త పంటలు సాగు చేయాలన్నారు. నీటి ఆదా కోసం డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగించాలన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలు, కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవి, సర్పంచ్ పార్వతి, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యాం సుందర్‌రెడ్డి, ఎంపీడీఓ సాల్మన్ రాజు, హౌసింగ్ డీఈ రామ్మూర్తి, డీటీ నాగరాజు, సొసైటీ చైర్మన్ కేశన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సేవా పతకాలకు ఎంపిక
● త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
అనంతపురం సెంట్రల్: ఉగాది పండుగను పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు, అగ్నిమాపక, విజిలెన్స్ అధికారులు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తమ సేవా పతకానికి ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐలు రాంబాబు, మునిరత్నం, సేవా పతకానికి టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ క్రాంతికుమార్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ రాజకుళ్లాయప్ప, స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్ గోపీ, బొమ్మనహాళ్ కానిస్టేబుల్ జగదీష్, 14వ బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ స్వామిదాస్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు, గోపీనాథ్, అగ్నిమాపకశాఖలో లీడింగ్ ఫైర్‌మెన్లు మదన్‌మోహన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ అక్కులప్ప ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ శాఖలో భాస్కర్‌నాయుడు, ఏపీ పోలీసు సేవా పతకానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ శాఖలో శ్రీనివాసులు ఎంపికయ్యారు. త్వరలో వీరికి ఆయా శాఖల రాష్ట్ర ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
28న హ్యాకథాన్
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసుశాఖ,ఇన్‌కక్స్‌ఏఐ సంస్థ సహకారంతో ఈ నెల 28న అనంతపురంలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం ఆయన చాంబర్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.


