మా మొర ఆలకించండి | - | Sakshi
Sakshi News home page

మా మొర ఆలకించండి

Mar 17 2026 7:37 AM | Updated on Mar 17 2026 7:37 AM

అనంతపురం అర్బన్‌: తమ మొర ఆలకించి.. సమస్యలు పరిష్కరించండంటూ అర్జీదారులు అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్‌ ఆనంద్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి వివిధ సమస్యలపై 405 అర్జీలు స్వీకరించారు. ఇందులో 298 అర్జీలు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఇతర సమస్యలపైన 107 వినతులు అందాయి. అర్జీల పరిష్కారంపై కలెక్టర్‌ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. గుత్తి కోట ఉత్సవాలను విజయవంతం చేశారంటూ అధికారులను కలెక్టర్‌ ఆనంద్‌ అభినందించారు. అప్పగించిన బాధ్యతలను అందరూ సక్రమంగా నిర్వర్తించారన్నారు.

వినతుల్లో మచ్చుకు కొన్ని..

ఇంటి నిర్మాణం పూర్తయినా పూర్తి బిల్లు మంజూరు కాలేదని పామిడి మండలం కల్లూరుకు చెందిన నరసింహులు అధికారులకు అర్జీ అందజేశాడు. గత ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తే నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తి చేశామని చెప్పాడు. రూ.1.80 లక్షలకు గానూ రూ.90 వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.90 వేలు మంజూరు చేయించాలని విన్నవించాడు.

● రోడ్డు స్థలం ఆక్రమించి షెడ్డు నిర్మించి రస్తా లేకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని రాయదుర్గం పట్టణం ఎరుకల విధికి చెందిన శివన్న ఫిర్యాదు చేశారు. షెడ్డును తొలగించాలని మునిసిపాలిటీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని తెలిపాడు. పరిష్కార వేదికలోనూ గతంలో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఇకనైనా రస్తా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.

‘పరిష్కార వేదిక’లో ప్రజల వినతి

వివిధ సమస్యలపై 405 అర్జీలు

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఆదేశం

ఈ రైతు పేరు

మిడతల నాగన్న. బుక్కరాయసముద్రం చెన్నంపల్లి గ్రామం. భూ సమస్యను పరిష్కరించాలని ఐదేళ్ల నుంచి అర్జీ ఇస్తున్నా అధికారులు స్పందించలేదు. ఈ రైతుకు సర్వే నంబరు 371–2ఏలో 4.44 ఎకరాలు పిత్రార్జితంగా సంక్రమించిన పట్టా భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాలను వేరొక వ్యక్తి ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడని నాగన్న తెలిపాడు. తమ పొలం కింది భాగాన భూమి కొనుగోలు చేసి... ఆ భూమిని కాకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో తమ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడని ఆరోపించాడు. సమస్య పరిష్కరించాలని ఐదేళ్లగా తహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్‌లో అర్జీలు ఇస్తున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement