బొమ్మనహాళ్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణా కష్టాలు తప్ప డం లేదు. బస్సులు తిరగని రూట్‌లోని విద్యార్థులపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణం. మండలంలోని 18 పాఠశాలల పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 1,003 మంది ఉన్నారు. వీరికి మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌లో మూడు, ఉద్దేహాళ్ హైస్కూల్‌లో ఒకటి చొప్పు న మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
● బళ్లారి – కళ్యాణదుర్గం మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఆయా గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. అయితే నేమకల్లు, ఉంతకల్లు, చంద్రగిరి గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. దేవగిరి, గోవిందవాడ, దర్గాహొన్నూరు, కల్లుహోళ, శ్రీధరఘట్ట, సింగానహళ్లి గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నా.. అది పరీక్షల సమయానికి లేవు. చంద్రగిరి పాఠశాలలో టెన్త్ విద్యార్ధులకు జిందాల్ ఫ్యాక్టరీ యజమాన్యం బస్సు ఏర్పాటు చేసింది. మిగిలిన గ్రామాల విద్యార్ధులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ లగేజీ ఆటోల్లో సాహసం చేస్తూ ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు పనులు మానుకొని ద్విచక్ర వాహనాలపై విద్యార్ధులను ఎక్కించుకొని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పరీక్ష అనంతరం మధ్యాహ్నం ఎండలో ఆటోల్లో వెళ్లలేక విద్యార్ధులు అవస్ధలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పదో తరగతి విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
పరీక్ష అయిపోయాక బొలెరో వాహనంలో స్వగ్రామాలకు వెళ్తున్న టెన్త్ విద్యార్థులు


