గార్లదిన్నె: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం బధిర విద్యార్థి పట్ల శాపంగా మారింది. ఫీజు చెల్లించని కారణంగా పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. తాటిచెర్ల గ్రామానికి చెందిన ఆజాద్‌వలికి పుట్టుకతోనే మూగచెవుడు. బధిరుడైన ఇతడికి తల్లి లేదు. తండ్రి సంరక్షణలో ఉంటున్నాడు. గ్రామంలోని ఉన్నతపాఠశాలలో చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించే విషయంలో పాఠశాల హెచ్‌ఎం–ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. తండ్రికి తెలిపి ఫీజు కట్టించుకోవడంలో తాత్సారం చేశారు. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులు పరీక్ష కోసం గార్లదిన్నె జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలోని పరీక్ష కేంద్రానికి వెళ్లారు. తాను కూడా పరీక్ష రాయాలన్న తపనతో ఆజాద్‌వలి రెడీ అయ్యి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది, ఇన్విజిలేటర్లు హాల్‌టికెట్ అడగ్గా బిత్తర చూపులు చూశాడు. తోటి పిల్లలు గదుల్లోకి వెళ్తుంటే దీనంగా ఉండిపోయాడు. చివరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ‘అయ్యో పాపం’ అంటూ నిట్టూర్చారు. పరీక్ష ఫీజు కట్టించే విషయంలో ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి ఉంటే ఆ విద్యార్థికి విద్యా సంవత్సరం వృథా అయ్యుండేది కాదు.


