అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసిన యువకుడిని అనంతపురం మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐ శరత్ చంద్ర సోమవారం వెల్లడించారు. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన పాల్తే సాయికుమార్‌నాయక్ ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తాగుడు, జూదాలకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నెల 10న రాత్రి ఇండియన బ్యాంక్ ఏటీఎం గదిలోకి చొరబడి యంత్రం తలుపులు తీయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో సైరన్ మోగడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండు సమీపంలో తచ్చాడుతున్న సాయికుమార్ నాయక్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
వేతనాలు చెల్లించకపోతే సమ్మె తప్పదు
● సత్యసాయి తాగునీటి పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు
అనంతపురం టవర్‌క్లాక్: వేతన బకాయిలు చెల్లించకుంటే సమ్మెలోకి వెళతామంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఓ ఆనంద్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. ఏప్రిల్ 1 నాటికి 5 నెలల బకాయిలు పేరుకుపోతాయని తెలిపారు. దాదాపు 28 సంవత్సరాలుగా సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా 900 గ్రామాల్లో 560 మంది కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోవంతో కార్మిక కుటుంబాలు దుర్భర జీవనం సాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీరాములు, వన్నూరప్ప, హరిప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు.
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
మరొకరికి తీవ్రగాయాలు
గుంతకల్లు రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని అనంతపురం రోడ్డులో నివాసముంటున్న అక్బర్‌బీ (45) కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచేందుకని సోమవారం తన మేనల్లుడు మహబూబ్ బాషాతో కలసి ద్విచక్ర వాహనంపై గుంతకల్లుకు వచ్చింది. పని ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు మార్గ మధ్యంలో నక్కనదొడ్డి వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో అక్బర్‌బీ మృతి చెందింది. ఘటనపై గుంతకల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
‘ఉపాధ్యాయుల బకాయిలు
వెంటనే చెల్లించాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీధర్ గౌడ్ తెలిపారు. 12వ పే రివిజన్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, సరెండర్ లీవులను వెంటనే చెల్లించడంతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల బకాయిలను త్వరితగతిన చెల్లించాలనే డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా సబ్ కమిటీ సభ్యులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.


